భారతదేశ స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపిన ప్రముఖ వ్యక్తుల్లో గాంధీజీ ముఖ్యులు. ఈయన శాంతి, సత్యాగ్రహాలను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిషర్లను గడగడలాడించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించేలా ప్రజలను సంఘటితం చేయడంలో విజయం సాధించారు. గాంధీజీ ఇచ్చిన ఒక్క పిలుపుతో యావత్ ప్రజానీకం ఆయన అడుగుజాడల్లో నడిచింది. హింసతో సాధించేదేదీ లేదు, అహింసతోనే విజయం పొందొచ్చు అన్న గాంధీ సిద్ధాంతం దేశానికి స్వరాజ్యం తెచ్చింది. విశ్వవ్యాప్తంగా ఉన్న ఎందరో పోరాట యోధులకు ప్రేరణగా నిలిచి, శాంతి మార్గంలో నడిచేలా చేసింది. జాతిపితగా ప్రసిద్ధిగాంచిన మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఏటా మన దేశంలో జనవరి 30న ‘అమరవీరుల దినోత్సవం’గా (Martyrs' Day) నిర్వహిస్తారు. జాతీయోద్యమంలో గాంధీజీ పాత్రను స్మరించుకోవడంతోపాటు స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరులను గౌరవించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
మహాత్మా గాంధీ 1948, జనవరి 30న దిల్లీలోని బిర్లా భవన్‌లో జరిగిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో నాథూరాం గాడ్సే ఆయనపై కాల్పులు జరపగా, అక్కడికక్కడే మరణించారు. భారత జాతీయోద్యమంలో ఆయన పోషించిన పాత్ర, సహకారాన్ని గుర్తుంచుకునే ఉద్దేశంతో ఏటా ఆయన వర్థంతిని ‘అమర వీరుల దినోత్సవం’గా నిర్వహిస్తారు. గాంధీజీ ఆదర్శలు, దేశానికి స్వేచ్ఛను అందించేందుకు అమరవీరులు చేసిన త్యాగాలను ఈ రోజు ప్రతిబింబిస్తుంది.