అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ (78) విజయం సాధించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారతీయ అమెరికన్ కమలా హారిస్ ఈ ఎన్నికలో ట్రంప్ చేతిలో ఓడారు.
రిపబ్లికన్ పార్టీకి చెందిన జేడీ వాన్స్ అమెరికా నూతన ఉపాధ్యక్షుడిగా పనిచేయనున్నారు.
ఆయన భార్య, అమెరికాకు సెకండ్ లేడీగా వ్యవహరించబోతున్న ఉష చిలుకూరి తెలుగు సంతతి మహిళ. ఉష పూర్వీకులది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం.
గెలిచిన భారతీయ అమెరికన్లు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఆరుగురు భారతీయ అమెరికన్లు ఎన్నికయ్యారు. గత కాంగ్రెస్‌లో అయిదుగురు భారతీయ అమెరికన్ సభ్యులు ఉండగా, ఈ సారి ఆ సంఖ్య 6గా ఉండనుంది.
శ్రీ తానేదార్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్ అమిబెరా, ప్రమీలా జయపాల్ మరోసారి విజయం దక్కించుకున్నారు. వారితో పాటు భారతీయ అమెరికన్ న్యాయవాది అయిన సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు. వర్జీనియా నుంచే కాక అమెరికాలోని తూర్పుతీర ప్రాంతం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు.