ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64 ఏళ్లు) 2025, నవంబరు 10న హైదరాబాద్‌లో మరణించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో... ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జులై 18న జన్మించారు.
‘జయ జయహే తెలంగాణ... జననీ జయ కేతనం...’ అంటూ తెలంగాణకు అధికారిక గీతం అందించారు. ఈ గీతాన్ని సరస్వతి అమ్మవారికి అంకితమిచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో కామారెడ్డిలో ధూంధాం పురుడు పోసుకున్నప్పుడు... దాన్ని ఏ పాటతో మొదలుపెట్టాలనే మీమాంస నుంచే 2002 సెప్టెంబరు 30న ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే గీతం వచ్చిందని చెప్పేవారు.