విద్య పొందడం అనేది మానవుల ప్రాథమిక హక్కు. ఇది ప్రజల్లో బాధ్యతను పెంపొందిస్తుంది. పేదరికాన్ని, అసమానతలను జయించడానికి చదువు మంచి సాధనం. సామాజిక మార్పు, స్థిరమైన అభివృద్ధికి చోదక శక్తిలా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడంలో విద్య పోషించే కీలక పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా జనవరి 24న ‘అంతర్జాతీయ విద్యా దినోత్సవం’గా (International Day of Education) నిర్వహిస్తారు. అందరికీ నాణ్యమైన విద్య అందేలా ప్రోత్సహించడంతోపాటు మారుతున్న సాంకేతిక అవసరాలకు తగ్గట్లు నిరంతర అభ్యసన ఆవశ్యకతను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
ప్రపంచవ్యాప్తంగా శాంతి, సమానత్వం, అభివృద్ధిని ప్రోత్సహించడంలో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని ఐక్యరాజ్యసమితి భావించింది. అందరికీ విద్య అనే సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా చదువు ఆవశ్యకతను చాటుతూ ఒక రోజును ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీనికి అనుగుణంగా ఏటా జనవరి 24న ‘అంతర్జాతీయ విద్యా దినోత్సవం’గా జరుపుకోవాలని 2018, డిసెంబరు 3న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. 2019 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
2026 నినాదం: The power of youth in co-creating education