ఒక వ్యక్తి తన చిన్నతనంలో కుటుంబ సభ్యుల ద్వారా నేర్చుకునే భాషను మాతృభాష అంటారు. ఇది మనిషికి వ్యక్తిత్వంతోపాటు గుర్తింపును ఇస్తుంది. సంప్రదాయాలు, వారసత్వంలో లోతైన బంధాన్ని ఏర్పర్చడంలో సాయం చేస్తుంది. మెరుగైన అభ్యాసం, అవగాహనకు మాతృభాష వాడకం అవసరం. కేవలం సమాచారాన్ని తెలపడానికే కాకుండా మన సంస్కృతిలో భాగమైన మాతృభాష ఔన్నత్యాన్ని గుర్తించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 21న ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా (International Mother Language Day) నిర్వహిస్తారు. భాషా వైవిధ్యాన్ని, అంతరిస్తోన్న భాషలను కాపాడటంతోపాటు బహుభాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏర్పాటుకు మూలం 1952లో నాటి తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో నిర్వహించిన భాష ఉద్యమం. 1971లో బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చే వరకు పాకిస్థాన్‌లో భాగంగా ఉండేది. అక్కడ మెజారిటీ ప్రజలు బెంగాలీ మాట్లాడుతున్నప్పటికీ పాకిస్థాన్ ప్రభుత్వం ఉర్దూను ఏకైక అధికారిక భాషగా ప్రకటించింది. దీంతో తూర్పు పాకిస్థాన్ వారు తమ అధికార భాషగా బంగ్లాను ఎపయోగించే హక్కు కోసం భాషా ఉద్యమాన్ని ప్రారంభించారు. 1952, ఫిబ్రవరి 21న ఢాకా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. వారిపై పోలీసులు కాల్పులు జరపగా అయిదుగురు మరణించగా అనేకమంది గాయపడ్డారు. మాతృభాష గుర్తింపు కోసం త్యాగం చేసిన నాటి విద్యార్థులను గుర్తుంచుకునేలా ఒక రోజును ఏర్పాటు చేయాల్సిందిగా బంగ్లాదేశ్ కోరింది. దీన్ని అనుసరించి 1999, నవంబరులో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) జనరల్ కాన్ఫరెన్స్ ఫిబ్రవరి 21న ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా జరుపుకోవాలని తీర్మానించింది. 2000 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
2002లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ రోజును అధికారికంగా గుర్తించింది. బహుభాషా విద్య, మైనార్టీ భాషలను రక్షించాలనే లక్ష్యంతో ఐక్యారాజ్యసమితి 2022-32ను ‘అంతర్జాతీయ స్వదేశీ భాషల దశాబ్దం’గా ప్రకటించింది.
2026 నినాదం: Youth voices on multilingual education