చిన్నారులు సమాజానికి, దేశానికి విలువైన సంపద. భావి పౌరులైన వీరి భద్రత, సంరక్షణ, అభివృద్ధికి అన్ని దేశాలూ ప్రాధాన్యం ఇవ్వాలి. బాల్యం ఆనందంగా సాగేలా చర్యలు తీసుకోవడంతోపాటు వారిలో నేర్చుకోవాలి, ఎదగాలనే తపన కలిగించే వాతావరణాన్ని కల్పించాలి. ప్రభుత్వాలతో సహా ప్రతి ఒక్కరూ బాలల సంక్షేమానికి పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ఏటా నవంబరు 20న ‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’గా (International Day Of Child Rights) నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, వారికి ఉన్న హక్కుల గురించి సమాజానికి తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1954, డిసెంబరు 14న చిన్నారుల సంక్షేమం, హక్కులను ప్రోత్సహించేందుకు ఒక తేదీని ఏర్పాటు చేయాలని భావించింది. పిల్లలకు రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ హక్కులు ఉన్నాయని పేర్కొంటూ యూఎన్‌ఓ 1959, నవంబరు 20న బాలల హక్కుల ప్రకటనను ఆమోదించింది. దీనికి కొనసాగింపుగా 1989 నవంబరు 20న బాలల హక్కుల ఒడంబడిక (చిల్డ్రన్ రైట్స్ కన్వెన్షన్ - సీఆర్‌సీ)ను ఐరాస ఆమోదించింది.
బాలల హక్కుల ప్రకటన, సీఆర్‌సీ ఆమోదం పొందిన నవంబరు 20న ‘అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం’గా జరుపుకోవాలని ఐరాస తీర్మానించింది. 1990 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.