ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా జులై 3న ‘అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం’గా (International Plastic Bag Free Day) నిర్వహిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తోన్న పర్యావరణ సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. ముఖ్యంగా పునర్‌వినియోగం కాని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లు, బాటిల్స్, ఇతర ఉత్పత్తుల వాడకం ఎక్కువయ్యాక ఈ వ్యర్థాలు భూమి, జలావరణ వ్యవస్థల్లో ఎక్కువగా పోగవుతున్నాయి. దీంతో ఆయా ఆవరణ వ్యవస్థల్లోని జీవులు నష్టపోవడమే కాక, జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంతోపాటు ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్, కంపోస్టింగ్‌పై ప్రజల్లో చైతన్యం కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ప్లాస్టిక్ వాడకాన్ని నివారించే ఉద్దేశంతో 2005లో స్పెయిన్ కేంద్రంగా ‘రీజీరో’ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. ముఖ్యంగా అక్కడి కాటలోనియా, బాలెరిక్ దీవులు ఈ వ్యర్థాల బారిన పడకుండా అనేక కార్యక్రమాలు, చర్యలు చేపట్టింది. ప్లాస్టిక్ వల్ల కలిగే హానికర ప్రభావాల గురించి చెప్పడంతోపాటు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వాడకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2008, జులై 3న మొదటిసారి ఈ సంస్థ ‘అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని’ నిర్వహించింది. తర్వాతి కాలంలో ప్రపంచ దేశాలు ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించాయి. రీజీరోకు జీరో వేస్ట్ యూరప్‌లో సభ్యత్వం ఉంది.