Published on May 16, 2025
Current Affairs
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

సమాజంలో కుటుంబ ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కుటుంబం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగం. ఇది లేనిదే మనుషులకు మనుగడ లేదు. సమాజంలో బాధ్యత ఉన్నవారిగా మెలిగేందుకు కావాల్సిన శిక్షణ కుటుంబం నుంచే లభిస్తుంది. ఇలాంటి కుటుంబ వ్యవస్థ గొప్పతనం, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ)లోని ఆర్థిక, సామాజిక మండలికి చెందిన సామాజిక అభివృద్ధి కమిషన్‌ కుటుంబం, దాని ప్రాముఖ్యంపై దృష్టి సారించాలని 1983లో యూఎన్‌ఓకు సిఫార్సు చేసింది. మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులు కుటుంబ వ్యవస్థ ప్రభావితమవుతోందని యూఎన్‌ఓ గుర్తించింది. కుటుంబ స్థితి, శ్రేయస్సును మెరుగుపరచడంతోపాటు సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా మే 15న ‘అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం’గా జరుపుకోవాలని యూఎన్‌ఓ జనరల్‌ అసెంబ్లీ 1993లో తీర్మానించింది. 1994 నుంచి  దీన్ని ఏటా నిర్వహిస్తున్నారు.
2025 నినాదం: Family-Oriented Policies for Sustainable Development: Towards the Second World Summit for Social Development