అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
ఓజోన్ పొర సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 16న ‘అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం’గా (International Day for the Preservation of the Ozone Layer) నిర్వహిస్తారు. దీన్నే ‘ప్రపంచ ఓజోన్ దినోత్సవం’ (World Ozone Day) అని కూడా అంటారు. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత (యూవీ) కిరణాలు భూమిపై నేరుగా పడకుండా ఓజోన్ పొర రక్షణ కల్పిస్తుంది. భూతలం నుంచి 18 నుంచి 50 కి.మీ. వరకు ఉన్న ఆవరణాన్ని స్ట్రాటో ఆవరణం అంటారు.
ఇందులో 25 - 40 కి.మీ. మధ్య ఒక దట్టమైన పొర ఉంటుంది. దీన్నే ఓజోన్ పొర అంటారు. మానవ చర్యల ఫలితంగా వాతావరణంలోని ఈ సహజసిద్ధ పొర సన్నగిల్లుతోంది. దీంతో భూమిపై జీవరాశులు యూవీ కిరణాల దుష్ప్రభావానికి గురవుతున్నాయి. ఓజోన్ పొర క్షీణత గురించి కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేయడంతోపటు దీని రక్షణకు చేపట్టిన పరిష్కార మార్గాలను చెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ఓజోన్ పొర రక్షణ కోసం మొదటిసారి 1985, మార్చి 22న ఆస్ట్రియా రాజధాని వియన్నాలో సమావేశం జరిగింది. ఇందులో ఓజోన్ క్షీణతకు కారణమైన వివిధ అంశాలను కట్టడి చేయాలని వివిధ సూచనలతో ఒప్పందం రూపొందించారు. భారత్ సహా 20 దేశాలు దీనిపై సంతకాలు చేశాయి.
దీనికి కొనసాగింపుగా 1987, సెప్టెంబరు 16న కెనడాలోని మాంట్రియల్ నగరంలో మరో సమావేశం జరిగింది. 2000 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్లోరోఫ్లోరోకార్బన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ఇందులో తీర్మానించారు.
మాంట్రియల్ ఒప్పందంగా పేర్కొనే దీన్ని 197 దేశాలు ఆమోదించాయి. దీనిపై 1992లో భారత్ సంతకాలు చేసింది. ఈ ఒప్పందం చరిత్రలోనే అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందంగా గుర్తింపు పొందింది.
దీనికి గుర్తుగా 1994లో ఐక్యరాజ్యసమితి సెప్టెంబరు 16ని ‘అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం’గా ప్రకటించింది. 1995 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
2025 నినాదం: From science to global action