అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఏర్పాటుకు గుర్తుగా ఏటా జూన్ 23న ‘అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం’గా నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగగా ఒలింపిక్స్‌ను పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఈ పోటీల్లో పాల్గొంటాయి. ఇవి సాధారణంగా ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతాయి. లింగం, వయసు, క్రీడాకారుల సామర్థ్యం అనే వివక్ష లేకుండా అందరూ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
ఒలింపిక్స్ క్రీడలు క్రీ.పూ.776 నాటివి. గ్రీస్‌లోని ఒలంపియాను వీటికి పుట్టినిల్లుగా పేర్కొంటారు.
అప్పట్లో వీటిని జ్యూస్ దేవుడి గౌరవార్థం మతపరమైన వేడుకగా ప్రతి నాలుగేళ్లకోసారి నిర్వహించేవారు.
క్రీ.శ.393 వరకు ఇవి జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
అయితే యుద్ధాలు, ఇతర కారణాల వల్ల ఇవి నిలిచిపోయాయి.
ఫ్రెంచ్ చరిత్రకారుడు బారన్ పియరీ కూబెర్టిన్ ఒలింపిక్ క్రీడలను పునరుద్ధరించాలని భావించి, 1894, జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)ని ఏర్పాటు చేశారు.
మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1896, ఏప్రిల్ 6 నుంచి 14 వరకు గ్రీస్‌లోని ఏథెన్స్‌లో జరిగాయి.
1948లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఐఓసీ 42వ సమావేశంలో ఏటా జూన్ 23న ’అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం’గా నిర్వహించాలని తీర్మానించారు.