ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ రోబోను అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇలాంటి 30వేల రోబోలు ఒక సూది మొనపై ఇమిడిపోతాయి.
ఇంత చిన్నగా ఉన్నప్పటికీ కదలికల సామర్థ్యాన్ని కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఇది కాంతి తరంగాలతో సులువుగా చర్యలు జరపగలదు.
శరీర కణజాల నమూనాలు సహా నిర్దిష్ట ప్రదేశాలకు అలవోకగా చేరుకోగలదు. విస్పష్ట ఫొటోలు తీయగలదు. వైద్య అవసరాలు, భౌతిక శాస్త్రంలో అనేక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.
ఏమిటీ రోబో?
డైఫ్రాక్టివ్ రోబోటిక్స్ అనే విధానం కోసం ప్రధానంగా ఈ రోబోను అభివృద్ధి చేశారు. దీనికి వెలుపలి నుంచి వైర్ల వంటి ఎలాంటి సాధనాల సంధానత ఉండదు.
కదలికలు సాగించగల రోబోల విషయంలో కార్నెల్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రపంచ రికార్డును సాధించారు. గతంలో వీరు 40-70 మైక్రాన్ల రోబోను తయారుచేశారు.
ప్రస్తుత డైఫ్రాక్టివ్ రోబో 2-5 మైక్రాన్ల పరిమాణాన్ని కలిగి ఉంది. ఒక మైక్రాన్ అంటే.. మీటరులో 10 లక్షల వంతు!