అణు విద్యుత్తు సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచుకోవాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ప్రస్తుతం దేశంలో 8.8 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉంది. దీన్ని 2032 నాటికి 22 గిగావాట్లకు పెంచాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం అణు విద్యుత్తు కేంద్రాలను ఎన్‌పీసీఐఎల్ నిర్వహిస్తోంది. కొత్తగా ఎన్టీపీసీ అణు విద్యుత్తు రంగంలోకి అడుగుపెడుతోంది. 2047 నాటికి 30 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని ఎన్టీపీసీ భావిస్తోంది.
అణు విద్యుదుత్పత్తిలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంలో కేంద్రం గతేడాది మార్చిలో తొలి న్యూక్లియర్ పవర్ టెండర్ జారీ చేసింది. దీని ప్రకారం ప్రైవేటు రంగ సంస్థలు తమ సొంత విద్యుత్తు అవసరాల కోసం స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లు (ఎస్‌ఎంఆర్) ఏర్పాటు చేసుకోవచ్చు.