ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవం
ఆర్థిక ప్రగతి, స్వయం సమృద్ధిలో అంకురాలు (స్టార్టప్స్) ఎంతో కీలకం. వాటిని నెలకొల్పినవారిని గౌరవించాలనే లక్ష్యంతో ఏటా ఆగస్టు 21న ‘ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవం’గా (World Entrepreneurs Day) నిర్వహిస్తారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనను వాస్తవ రూపంలోకి తెచ్చి.. ఆర్థిక ఒడిదొడుకులను తట్టుకుని.. ఉద్యోగులకు మార్గదర్శనం చేస్తూ.. వ్యవస్థను ముందుండి నడిపే గొప్ప శక్తే ‘ఎంట్రపెన్యూర్’. ఆవిష్కరణలను పెంపొందించడంలో, ఆర్థిక వృద్ధిని సాధించడంలో, స్థితిస్థాపక సమాజాన్ని నిర్మించడంలో వీరు ముఖ్య పాత్ర పోషిస్తారు. సాధారణంగా వీరు చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా దాన్ని అభివృద్ధి చేయడంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారు. సిద్ధాంతాలు, ఆదర్శాలతో సంస్థను తీర్చిదిద్దుతారు. దేశ ప్రజలకు ఉపాధి కల్పనలో ఆర్థికాభివృద్ధిలో వీరు కీలకంగా వ్యవహరిస్తారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి వీరు చేస్తోన్న కృషిని అభినందించడంతోపాటు సాధికారత కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: ప్రపంచ వ్యవస్థాపకుల దినోత్సవాన్ని మొదటిసారి 2010లో నిర్వహించారు. గ్రాస్హాపర్ కంపెనీ సహవ్యస్థాపకులైన డేవిడ్ హౌసర్, సియామక్ తగ్డోస్ ఈ రోజును ప్రతిపాదించారు. స్థిరమైన ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో, పేదరికాన్ని తగ్గించడంలో వ్యవస్థాపకుల కృషిని తెలియజేయడంతోపాటు వారిని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాల్లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతున్నారు.