Published on Nov 12, 2025
Current Affairs
జాతీయ విద్యా దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం

దేశ భవిష్యత్తును రూపొందించడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో విద్య ముఖ్య భూమిక పోషిస్తుంది. నైపుణ్యంతో కూడిన చదువుల ద్వారానే మానవాభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వాలు చదువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, అందరూ విద్యను అభ్యసించేలా ప్రోత్సహిస్తున్నాయి. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చాలా కాలం పనిచేశారు. దేశంలో విద్యాభివృద్ధికి ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. అబుల్‌ కలాం జయంతిని పురస్కరించుకుని మన దేశంలో ఏటా నవంబరు 11న ‘జాతీయ విద్యా దినోత్సవం’గా (National Education Day) నిర్వహిస్తారు. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం; దేశ ప్రగతి, వ్యక్తిగత శ్రేయస్సులో చదువు పోషించే పాత్ర గురించి అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం

దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్‌ కలాం ఆజాద్‌ సేవలను గుర్తుంచుకునే ఉద్దేశంతో ఏటా ఆయన జన్మదినాన్ని ‘జాతీయ విద్యా దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం 2008, సెప్టెంబరులో తీర్మానించింది. అదే ఏడాది నవంబరు 11 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.