కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో జల్ సంచయ్ జన్ భాగీదారీ (జన భాగస్వామ్యంతో జల సంరక్షణ) విభాగం కింద తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును సొంతం చేసుకొంది. కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద తెలంగాణ మొత్తం 5,20,362 పనులు పూర్తిచేసి ఈ ఘనతను సాధించింది. రెండు, మూడు స్థానాలను ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లు సొంతం చేసుకున్నాయి.
నవంబరు 18న దిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. జల్ సంచయ్ జన్ భాగీదారీని ఉత్తమంగా అమలు చేసిన రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక సంస్థలకు 2025 ఏడాదికి కేంద్రం 100 అవార్డులను ప్రకటించింది. ఇందులో మూడు రాష్ట్రాలు, 67 జిల్లాలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, ఒక పట్టణ స్థానిక సంస్థ, రెండు భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రెండు పరిశ్రమలు, మూడు ఎన్‌జీఓలు, ఇద్దరు దాతలు, 14 మంది నోడల్ అధికారులు ఉన్నారు.