దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 3 నుంచి 10 ఏళ్ల గడువుతో 14 రంగాలకు అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) మంచి ఫలితాలను ఇస్తున్నట్లు నీతి ఆయోగ్ తాజాగా ‘ఇంపాక్ట్ అసెస్‌మెంట్ ఆఫ్ పీఎల్‌ఐ స్కీమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద అందించడానికి రూ.1,91,049 కోట్లు కేటాయించగా.. అందులో ఇప్పటివరకూ రూ.35,354 కోట్లు (18.51%) పంపిణీ చేసినట్లు తెలిపింది. ఫలితంగా ఈ రంగాల్లోకి కొత్తగా రూ.2.40 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది.
రూ.22 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు/ అమ్మకాలు జరిగినట్లు వెల్లడించింది. 8.49 లక్షల మందికి ఉపాధి లభించినట్లు పేర్కొంది. మొత్తం 30,18,750 ఉద్యోగాల కల్పన లక్ష్యానికిగానూ ఇప్పటివరకూ 28% సాధించినట్లు వెల్లడించింది.